2007 సాహిత్య సింహావలోకనం – కథ

      book01వర్తమానానికి ఏడాది అంటే 365 రోజులు. పన్నెండు నెలలు. యాభై రెండు వారాలు. చరిత్రలో ఏడాది ఏమీకాని ఓ పుట. ఆధునిక యుగంలో ప్రతి క్షణమూ విలువైనదే. పూర్వం రోజుల్లో దశాబ్దాలు కూడా సాఫీగా సాగినట్టు చరిత్ర చెప్తోంది. కాని వర్తమానం గడ్డుకాలం. అప్పుడూ – ఇప్పుడూ – ఎప్పుడూ. ఏడాదిపాటు తెలుగులో వెలువడిన సాహిత్యాన్ని విహంగ వీక్షణం చేయడమనే దుస్సాహసం చేస్తున్నా. ప్రస్తుతం వెలువడుతున్న అన్ని దిన, వార, పక్ష, మాస పత్రికల్లో, వార్షిక ప్రత్యేక సంచికల్లో ఏడాదిపాటు వెలువడిన సాహిత్యాన్ని పరిమిత స్థలకాల వ్యవధుల్లో పరిశీలించబూనడం దుస్సాహసం కాక మరేమిటి? ఇదికాక పత్రికల పేజీలకెక్కకుండానే నేరుగా పుస్తకాలుగా వచ్చే సాహిత్యం; ఇతర భాషల్లో పాఠకాదరణ పొందిన తర్వాత మన పాఠకులను సైతం అలరిద్దామని వచ్చే అనువాద సాహిత్యం; ఎప్పుడో ముద్రణై ప్రతులు చెల్లిపోయి అధిక పాఠకుల అభీష్టం మేరకు పునర్ముద్రణ పొందే సాహిత్యం; వీటినికూడా పరిశీలించాల్సి వుంది. అంతకంటే ముందర సాహిత్యమనే విస్తృత పదాన్ని చూడాలి. కథ, కవిత, నవల, వ్యాసం, చరిత్ర, పరిశోధన, విజ్ఞానం, నాటిక, నాటకాలు ప్రక్రియ ఏదైనా అక్షరాల్లో వ్యక్తమైన మానవానుభూతులు, అనుభవాలు అన్నింటినీ సాహిత్యంగానే పరిశీలించాలి.

      ఈ ఏడాది వచ్చిన సాహిత్యంలో కథల సంకలనాలు, సంపుటాలను పరిశీలించినప్పుడు రాశిలో వాహిని బుక్ ట్రస్ట్ ముందుంటుంది. ఎలక్ట్రాన్ రచించిన కథలతో ‘ముళ్లకుర్చీలు ‘, డాక్టర్ చిత్తర్వు మధు కథలతో ‘బై బై పొలోనియా’; కనుమూరి పద్మిని కథలను ‘మీరు దొంగకాదా మాస్టారూ’ గాను, పాలెపు బుచ్చిరాజు రచన మాస పత్రికలో సీరియలుగా వెలువరించిన కథలతో ‘వీర విక్రమార్కం అను బొమ్మలు చెప్పిన కతలు ‘సంపుటిని, సీనియర్ రచయిత్రులు తురగా జయశ్యామల కథలతో ‘శంఖారావం ‘, వి.రామలక్ష్మి కొన్ని కథలను ‘నాకూ విశ్రాంతి కావాలి ‘గానూ ప్రచురించింది. రచన మాసపత్రిక నిర్వహించిన యడ్లపాటి వెంకట సుబ్బారావు స్మారక పోటీలో గెలుపొందిన 26 కథలతో ‘కథావాహిని-2007′ కూడా వాహిని బుక్ ట్రస్ట్ ఆ సిరీసులో భాగంగా ప్రచురించింది. ఈ ఏడాది విశాలాంధ్ర ప్రచురణ సంస్థ కథల పుస్తకాల సంఖ్య విషయంలో కొంచెం నిదానించింది. డాక్టర్ వి.ఆర్. రాసాని కథలతో ‘పయనం’ కథా సంపుటిని, సింగమనేని నారాయణ రాసిన 16 కథలతో ‘అనంతం’ కథాసంపుటిని వీటిలో ముందుగా చెప్పుకోవాలి.

      రెండేళ్ల కిందట ‘చిన్న పరిశ్రమలు – పెద్ద కతలు ‘ పేరుతో పారిశ్రామికీకరణ దుష్ఫలితాలను కమనీయంగా కథనీకరించిన డాక్టర్ సోమరాజు సుశీల ఈసారి మరో సమస్యను తన కొత్త కథాసంపుటిలో స్పృశించారు. ప్రతి సామాజిక వర్గానికి వాళ్ల తరపున పోరాడడానికి వాళ్లే ముందుకొస్తారు. కాని పిల్లలకు మాత్రం ఆ అదృష్టం లేదు. వాళ్ల సమస్యలు, వాళ్ల అస్తిత్వ ఉనికి పరకాయప్రవేశం చేసి పెద్దలే చెప్పాలి. ఆ పని ఎవరు చేసినా పెద్ద మనసుతో వాటిని స్వాగతిస్తాం. గిజుభాయి గుజరాతి భాషలో రాసిన చిన్నపిల్లల పార్టీకి మేనిఫెస్టో అనదగ్గ ‘చిన్నారి ‘ని తెలుగు పాఠకులు ఎంతో సమాదరించారు. ఈ ఏడాది సోమరాజు సుశీల ‘ఇల్లేరమ్మ కతలు ‘లో చిన్నపిల్లల ఆవేదనలకు, అనుభూతులకు అక్షరరూపమిచ్చారు. ఇల్లేరమ్మ కతలతో చిన్నచిన్న కతలతో రచయిత్రి పాఠకుల మనసులు దోచుకున్నారు. చిన్న పిల్లల గురించిన సాహిత్యంపై మళ్లీ మనందరమూ ఆశతో చూసేలా చేశారు. ‘కొత్త చివుల్లు ‘పేరుతో కూతురు రాం రెడ్డి మానవీయ విలువలున్న కథలను సంపుటీకరించారు.

రేగడి విత్తులు నవలతో లక్ష రూపాయలు కొట్టేసి అందరి దృష్టినీ ఆకట్టుకున్న చంద్రలత ఈ ఏడాది తన ఆరు కథలను ‘వివర్ణం’ పేరుతో సంపుటీకరించారు. ఈ ఏడాది రిచ్చిగా అంటే అందమైన మంచి ముస్తాబుతో వెలువడ్డ మూడు పుస్తకాలలో ఈ వివర్ణం ఒకటి (మిగిలిన రెండూ: కథ-2006, నూరేళ్ల తెలుగు నవల). వివర్ణం సంపుటిలో కథలన్నీ ఆహ్లాదకరంగా సాగడంతో పుస్తకం రూపునకు వన్నె తెచ్చాయి. అందే నారాయణస్వామి తన కథలు కొన్నింటిని ‘చీకటి తెరలు ‘పేరుతో సంపుటిగా ప్రచురించారు. తెలుగునుంచి ఇంగ్లిషులోకి, ఇంగ్లిషునుంచి తెలుగులోకి అనువాదం చేయడంద్వారా సాహిత్యాన్ని విస్తృతం, సుసంపన్నం చేస్తున్న డా. వి.వి.బి.రామారావు తన కొథలు కొన్నింటిని ‘కథల కదంబం’ పేరుతో సంపుటిగా తెచ్చారు. అందులోని కథలన్నీ నిర్మాణంలో ఎంతో నిరాడంబరంగా, అవి పాఠకునికి అందించే సందేశంలో అంతే ఉదాత్తంగా ఉన్నాయి. అప్పటివరకు వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథలనే పుస్తకంగా ప్రచురించడం ఆనవాయితీ. కాని కె.వి.నరేందర్ ఇందుకు భిన్నంగా తన అముద్రిత కథలను ‘సిటీ’ పేరుతో ఈ ఏడాది ప్రచురించారు. ఇందులోని కథలన్నీ గ్రామాలనుంచి పట్టణాలకు వలసపోవడంవల్ల పట్టణాల్లో మనుషులు, మనసులు, వసతులూ ఎంత ఇరుగ్గా తయారయ్యాయో చెప్పడానికి ప్రయత్నించారు.

books03టంగుటూరి శ్రీలక్ష్మి తన కథల్లో కొన్నింటిని ఏర్చి ‘ఎంతవారలైనా’ పేరుతో సంపుటిగా ప్రచురించారు. కె.వరలక్ష్మి కొన్ని కథలతో ‘అతడు-నేను ‘సంపుటాన్ని తీసుకొచ్చారు. ఇక కథా సంకలనాల విషయానికొస్తే గత దశాబ్దిన్నర పైబడి కథాసాహితి ఏటా వెలువడిన ఉత్తమ కథల్లో కొన్నింటిని ఏరి ప్రచురిస్తోన్న ‘కథ ‘ సిరీస్ ఈ ఏడాదికూడా ‘కథ-2006′గా వెలువడి కథాభిమానుల మన్నన పొందింది. అదికాకుండా మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ ఏడవదిగా ప్రచురించిన ఉత్తమ కథల సంకలనం ‘కథావార్షిక-2006′ డా.వి.ఆర్. రాసాని, మధురాంతకం నరేంద్రల సంపాదకత్వంలో వెలువడింది. ఇందులో పది కథలను సంకలనపరచగా కథలోనూ, కథావార్షికలోనూ చోటు సంపాదించుకున్న పెద్దింటి అశోక్ కుమార్ ‘మాయిముంత ‘, అక్కిరాజు భట్టిప్రోలు ‘గేటెడ్ కమ్యూనిటీ’, దగ్గుమాటి పద్మాకర్ ‘యూటర్న్ ‘కథలపై వివిధ పత్రికల సాహిత్య పేజీల్లో వస్తు రూపాలపైన విలువైన చర్చ జరిగింది. కడప జిల్లాలోని పాతతరం నుంచి నేటివరకూ రచనలు చేస్తున్న వారు వెలువరించిన భిన్నస్వరాల కథల సంకలనం తవ్వా ఓబుల్రెడ్డి సంపాదకత్వంలో ‘కడప కథ ‘పేరుతో వెలువడింది. దళితోద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా జూపాక సుభద్ర, గోగు శ్యామలల సంపాదకత్వంలో ‘నల్లరేగడి చాల్లు ‘వెలువడగా, ఇస్లాంవాద స్ఫూర్తిని ఎత్తిచూపుతూ గీతాంజలి సంపాదకత్వంలో ‘పెహచాన్ ‘వచ్చింది.

ఇవికాక చదివిన చాలారోజుల దాకా మనల్ని వదిలివెళ్లని మట్తి పరిమళం వెదజల్లే మరికొన్ని మంచి కథాసంపుటలివి: ఒక రాత్రి రెండు స్వప్నాలు (గంటేడ గౌరునాయుడు), గజఈతరాలు (గొరుసు జగదీస్వరరెడ్డి), మాయిముంత (పెద్దింటి అశోక్ కుమార్), కొలుపులు కట్టడి (కొలకులూరి ఇనాక్), మచ్చుగొమ్మ (దిలావర్), బోన్సాయ్ మనుషులు (సిమ్హప్రసాద్), అన్నంగుడ్డ (దేవేందర్), కుట్ర (జాతశ్రీ), బందీ (చిలుకూరి దేవపుత్ర), మన్నులో మన్నునై (ఎం.ఆర్.అరుణకుమారి)… మొదలైనవి కొన్ని మాత్రమే.

ఇక విడి కథల విషయానికొస్తే, ఈ సారి పత్రికలు యథావిధిగా అన్ని భావజాలాల కథలకూ తమ పేజీల్లో చోటిచ్చాయి. విపుల మాసపత్రిక నిర్వహించిన కథల పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన అద్దేపల్లి ప్రభు ‘అతడు మనిషి ‘కథ ఈ ఏడాది మొదట్లో శుభం పలికింది. మారుతున్న కాలంతోటే మార్పు చెందుతున్న మానవ సంబంధాల్లో కొత్త కోణం చూపించిందీ కథ. సాహిత్య నేత్రం త్రైమాసికలో ప్రచురించిన వి.ప్రతిమ ‘గాలి గంగమ్మ ‘మానవ నైజాన్ని వెలికితీస్తే, ఆంధ్రజ్యోతి ఆదివారంలొ పాపినేని శివశంకర్ ‘సముద్రం’ కథ మనసులోతును పరిశీలించబూనింది. ఎప్పటిలానే తెలుగు మార్క్వెజ్ అని పిలవదగ్గ డా. వి.చంద్రశేఖరరావు ‘సుందరం కలలవి ఏ రంగు?’తో వెన్నులో వణుకు పుట్టించారు. మాజిక్ రియలిజమే కాదు ఏ రకమైన ప్రక్రియాపరమైన కథనైనా స్వాగతించే పాఠకులకు ఈ ఏడాది కాస్త నిరాశే. పెద్దింటి అశోక్ కుమార్ ‘నువ్వు-నేను-ఆ వెన్నెల రాత్రి ‘, గోపరాజు నారాయణరావు ‘వేర్లు లేని చెట్టు ‘, కె.వి.కూర్మనాధ్ ‘వెన్నెల పడవ ‘కథలు కొంత వూరటనిచ్చాయి. గబ గబా గుర్తు తెచ్చుకుంటే ఈ ఏడాది వచ్చిన మరికొన్ని మంచి కథలుగా ఈ కథలు స్పురణకొస్తున్నాయి. పయనం (వి.ఆర్.రాసాని), అద్దంలో చిత్రం (వి.పోతన్న), భూమి (పి.చంద్రశేఖర అజాద్), ఉదారస్వభావం (ఆరి సీతారామయ్య), గూడు (కొండవీటి సత్యవతి), భ్రమ (యాళ్ల అచ్యుతరామయ్య), జుమ్మ (వేంపల్లె షరీఫ్), రోషనారా (ఓల్గా), సంతకాలు (మొలకలపల్లి), సూతకం కబురు (అట్టాడ అప్పలనాయుడు), నెగడు (నల్లూరి రుక్మిణి), మాయతెర (మంచికంటి), స్వాతంత్ర్యం పెద్దపులి (సి.హెచ్.మధు), గూడు చెదిరింది (దిలావర్) మొదలైన కథలు కొన్ని మాత్రమే.

మరిన్ని ప్రక్రియల్లో ఈ ఏడాది వెలువడిన సాహిత్యంపై విపులమైన వ్యాసాలు మరికొన్ని త్వరలో…

2 స్పందనలు నుండి “2007 సాహిత్య సింహావలోకనం – కథ” కు


  1. 1 రాజేంద్ర కుమార్ దేవరపల్లి 5:03 అపరాహ్నం వద్ద జనవరి 22, 2008

    రవిగారూ చాలా రోజులకు..బాగుంది.పెద్ద పనే పెట్టుకున్నారు .అభినందనలు.

  2. 2 indunelluru 6:13 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 2, 2008

    రవి సర్, మీ శీర్షిక చాలా బాగుంది. మొత్తం చదివాను. ఎంత మెటీరియల్ గేథర్ చేశారు. నిజంగా అద్భుతం. అయితే అంతా అనుకూలంగానే రాశారే. అంటే 2007లో అన్నీ మంచి పుస్తకాలే వెలువడ్డాయని తెలుస్తుంది. ఏదో ఒక్కటే కొంచెం నిరాశపరిచిందని రాశారు. ఏదేమైనా మీ ప్రయత్నానికి అభినందనలు.


ప్రత్యుత్తరమిమ్ము




Blog Stats

  • 1,048 hits

a

 

జనవరి 2008
సో మం బు గు శు
« డిసెం   Feb »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Flickr Photos

acceptance

Cardiac

310/365 November 6, 2009

More Photos