చాలా కథలు, నవలలు రాసిన జాక్ లండన్ తెలుగు పాఠకులకు చాగంటి తులసిగారి పుణ్యమా అని ప్రకృతి పిలుపు రచయితగా సుపరిచితం. అమెరికన్ రచయిత జాక్ లండన్ తన ఇరవై మూడో యేట సోషలిస్టుగా ప్రకటించుకున్నాడు. చాలా స్పష్టంగా ప్రజల పక్షపాతం వహించిన లండన్ రచనలన్నీ ప్రగతిశీల భావాలు గల పాఠకులకు ఎంతో నచ్చుతాయి. తానెలా సోషలిస్టుగా మారిందీ తెలిపే ఈ వ్యాసపు అనువాదమిది. చదివి మీ అభిప్రాయం చెప్పండి.
నేనెలా సోషలిస్టును అయ్యానంటే…
ట్యుటానిక్ తెగకు చెందిన పాగాన్లు క్రిస్టియన్లుగా మారినట్టుగానే నేను కూడా సోషలిస్టుగా మారానని చెప్పుకోవాలి – నాకదే బలంగా అనిపిస్తుంటుంది. నా ‘మత ‘ మార్పిడి సమయంలో సోషలిజంవైపు చూడడమొక్కటే కాదు, దానికోసం పోరాడుతున్నాను కూడా. నేనప్పుడు మరీ చిన్న పిల్లాడిని, పరిణతి లేనివాడిని. వ్యక్తివాదం అనే మాటకూడా విననప్పటికీ దాని గురించి గుండెనిండా భక్తితో గొంతెత్తి పాడేవాడిని.
ఎందుకంటే నేను చాలా మొండిఘటాన్ని. నా ఉద్దేశంలో మొండి అంటే చురుకైన ఆరోగ్యం, మంచి కండలు తిరిగిన మనిషినని. ఎవరైనా ముందు చూసేది వీటినే. నా పసితనం కాలిఫోర్నియా పంటపొలాల్లోను, బాల్యం ఆరోగ్యకరమైన వెస్ట్రన్ సిటీ రోడ్లపై పేపర్లలో లుంగచుట్టుకుని గడవగా, శాన్ ఫ్రాన్సిస్కో తీరం, పసిఫిక్ సముద్రం నుంచి వచ్చిన ఓజోన్ సహిత నీటితో యవ్వనమంతా పెరిగాను. నాకు బహిరంగ జీవితమంటే ఇష్టం. నేను బహిరంగంగా కష్టపడ్డాను – అన్ని రకాల కష్టమైన పనులు. ఈ ప్రయాణంలో ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోకి మారుతునే ఉన్నాను గానీ ఏమీ నేర్చుకోలేకపోయాను. ప్రపంచంలో నేను చూసిన ప్రతి విషయాన్ని ఎంతో మెచ్చుకున్నాను. మళ్లీ చెప్తున్నా- ఇంత ఆశావాదిని ఎలా అయ్యానంటే నేను బలంగా ఆరోగ్యంగా ఉండడంవల్ల. నీరసంగా ఉందనో, ఈ నెప్పులు ఆ నెప్పులనో అనేవాడిని కాదు. పనికి పనికిరానని యజమాని ఎప్పుడూ తీసెయ్యలేదు. బొగ్గు గనిలోనో, సముద్రమ్మీద పడవపైనో, కష్టపడి చేసే ఏ పనైనా దొరికేది.
దీనంతటి వల్లా, నా యవ్వన జీవితాన్ని సంతోషకరంగా గడుపుతుండడం వల్లా, జీవితాన్ని – పోరాటాన్ని స్వయంగా సాగిస్తుండడం వల్లా నేనో దారుణమైన వ్యక్తివాదిని కాగలిగాను. అది చాలా సహజం. నేనో విజేతను. ఎక్కడ ఆట ఆడాల్సివచ్చినా చాలా ఖచ్చితంగా ఆడేవాడిని. మనుషులకు తగ్గట్టుగా ఆడేవాడిని. మ-ని-షి అన్న మాటల్ని పెద్ద అక్షరాలతో నా హృదయంపై రాసుకున్నాను. మనిషిలా సాహసించడం, మనిషిలా పోరాడడం, మనిషిలా పనిచేయడం (పిల్లలకిచ్చే డబ్బులే ఇచ్చినా)- ఇవన్నీ నన్ను మరింకేవీ పట్టుకోలేనంత గట్టిగా పట్టేశాయి. అస్పష్టంగా కనిపించే అంతులేని భవిష్యత్తువైపు చూసేవాడిని. మనిషిగా ఆడాల్సిన ఆటను సుస్థిర ఆరోగ్యంతో, ప్రమాదాలు లేకుండా, ఇదే తరహాలో అడేందుకు స్వప్నించేవాడిని. ఇప్పుడే చెప్పినట్టు, భవిత అంతులేనిది. నీషే కథానాయకులు బ్లాండ్ బీస్టులు కేవలం బలంతో అన్నీ జయించినట్టుగా నేనుకూడా కసితో ఆ బాటలో ప్రయాణిస్తున్నట్టు భావించేవాడిని.
దురదృష్టవంతులు, అనారోగ్యవంతులు, రోగులు, ముసలివారు, అంగవికలురు గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. నిజం చెప్తున్నా. వారు కూడా కష్టపడగలరని సరిగానే పనిచెయ్యగలరని ఊహించలేదు. మరి ప్రమాదాలు? అదంతా విధి. దీన్ని కూడా పెద్ద అక్షరాలతో రాయాల్సిందే, విధి ప్రసక్తే లేదు. వాటర్ లూ వద్ద నెపోలియన్ కు ప్రమాదం జరిగింది. కాని ఇంకో చివరి దశలో నెపోలియన్ కావాలన్న ఆశ మాత్రం నాలో చావలేదు. పైగా నా ఆశావాదం ఎంతలా ఉండేదంటే ఇనుము తిన్నా అరిగిపోయే కడుపు, కొండ గుద్దినా శరీరానికి ఏమీ కాదన్న భరోసా నాకుండేది.
ప్రకృతిలో బలమైన మనిషిగా ఎదిగినందుకు ఎంతో గర్వపడుతున్నానని స్పష్టం చేసినట్లుగానే నేను భావిస్తున్నాను. శ్రమ పట్ల గౌరవమనేది నాకన్నింటికంటే ఆత్మీయమైన అంశం. కార్లైల్, కిప్లింగ్ లను చదవకుండానే పని గురించి నేను చేసుకున్న సూత్రీకరణలు వారి సిద్ధాంతాలను మరుగున పడేస్తాయి. పనే సర్వస్వం. అదే పుణ్యమూ పురుషార్ధమూ. ఒక రోజు కష్టపడి పనిచేసి నేను పొందే ఆనందం మీకు అర్థం కాదు. ఆ రోజుల్ని ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నా ఆ ఆనందాన్ని మళ్లీ పొందలేకపోతున్నా. పెట్టుబడిదారు దోపిడి చేస్తున్నంత కాలమూ నేనో విశ్వసనీయమైన వేతనజీవినే. నాకు జీతమిచ్చేవాడి దగ్గర బద్దకించడం, పని ఎగగొట్టడం లాంటివి నాకు నేను, ఆతడికి నేను చేస్తున్న మహా పాపాలుగా భావించేవాడిని. దీన్ని రాజద్రోహం తరువాతి నేరంగా భావించేవాడిని.
ఒక్క మాటలో చెప్పాలంటే నా సంతోషకర వ్యక్తివాదం సనాతన బూర్జువా విలువలను మించిపోయింది. బూర్జువా పత్రికలు చదివాను, బూర్జువా బోధనలు విన్నాను, బూర్జువా రాజకీయుల శ్రావ్య నినాదాలు నినదించాను. కొన్ని ఇతర సంఘటనలు నా జీవితాన్ని మలుపు తిప్పకపోతే అసలు సందేహించక పోయేవాడిని. ప్రెసిడెంట్ ఇలియట్ అమెరికన్ హీరోల్లాగా నేను కూడా నిపుణుడైన జూదగాడి నయ్యేవాణ్ణి. సైనిక ట్రేడ్ ముఠాలు నడిపే క్లబ్బుల చేతుల్లో నా సంపాదన, నా తెలివి తాకట్టి పెట్టేవాడిని.
సరిగ్గా ఇదే సమయంలో, నా పద్దెనిమిదో ఏట, ఏడు నెలలు లైసెన్స్ లేకుండా సముద్రంలో పనిచేసి తిరిగొచ్చిన తరువాత, నేనింక దేశాలు తిరగాలని నిర్ణయించుకున్నాను. మూటా ముల్లె సర్దుకుని నానాయాతనలు పడి తూర్పు ప్రాంతాల్లో తిరగడం సాగించాను. అక్కడ తగిన మనుషులు దొరక్క పనులు ఎదురుచూసేవి. అవన్నీ ఇరుకైన తూరుపు కార్మిక కేంద్రాలనుకోండి. అక్కడ మనుషులు దద్దమ్మలు, వారికి తగిన పనికోసం తెగ ప్రయత్నించేవారు. ఈ బ్లాండ్ బీస్ట్ సాహస యాత్రలో జీవితాన్ని ఒక కొత్త, పూర్తిగా భిన్నమైన కోణంలో చూడడాన్ని ప్రారంభించాను. శ్రామికవర్గపు పీఠం నుంచి సామాజిక శాస్త్రవేత్తలు ప్రేమగా పిలుచుకునే మునిగిపోబోతున్న, అదృశ్యం కాబోతున్న చిన్న సమూహంలోకి లోకి జారిపోవడం గమనించాను. వారంతా ఎలా అందులోకి చేరుతున్నారో (చేర్చబడుతున్నారో) తెలుసుకుంటున్న కొద్దీ ఆందోళన కలగడం మొదలైంది.
అక్కడ నేను అన్ని రకాల మనుష్యులను చూశాను. అందులో చాలామంది ఒకప్పటి నాకంటే ఎంతో మంచివాళ్ళు. ఎంత మంచి అంటే బ్లాండ్ బీస్టులంత. నావికులు, సైనికులు, శ్రామికులు ఎంతమందో. ముసలి గుర్రాల మాదిరిగా యజమానుల చేతుల్లో నలిగి నలిగి నుగ్గు నుగ్గుగా మారిన మనుషులు. శరీరాకృతులు పూర్తిగా మారిపోయినవారు. వాళ్ల జీవిత గాధలు విన్నప్పుడల్లా ఒళ్లు ఉడికిపోయేది. పార్క్ తోటల్లో, ఇరుకు సందుల్లో అవన్నీ వింటూ ఆగలేక కూర్చునే బల్లల్ని, గేటు తలుపుల్ని గట్టిగా కొట్టేవాడిని. ఆ కథలన్నీ నా కథల్లాగే ఉండేవి. చెప్తూ, వింటూ వణికిపోయేవాళ్లం. ఆ కష్టాలు వారిని కూడ నాలాగే, కొన్నిసార్లు నాకంటే బలంగా తీర్చిదిద్దాయి. ఆ కథలే చివరికి మమ్మల్నిలా సామాజిక గుంట అడుగునున్న బురదలోకి తోసేశాయి. అధోజగత్తు సహోదరులుగా మార్చాయి.
అవన్నీ వింటున్న కొద్దీ నా బుర్ర పనిచేయడం ప్రారంభించింది. వీధిన పడ్డ స్త్రీలు, మురికిన పడ్డ పురుషులు నాకు దగ్గరకాసాగారు. ఒక మామూలు వస్తువులాగా ఆ సామాజిక గుంటను స్పష్టంగా చూడగలిగేవాడిని. ఆ గుంట అడుగున జనమంతా ఉంటే వారిపైన, మరీ పైన కాదు, నేనుండేవాడిని – జారిపోతూ గోడకు వేలాడుతూ, నా బలమంతా ఉపయోగించి నిలదొక్కుకుంటూ వేలాడుతూ…నిజం చెప్తున్నా భయంతో వణికిపోయేవాడిని. నా బలం సరిపోకపోతే? రాబోయే తరాలతో సరిసమానంగా భుజం భుజం కలిపి పనిచేయలేకపోతో? అప్పటికప్పుడే ఒక బ్రహ్మాండమైన ప్రతిన పూనాను. దాదాపుగా అదిలా ఉంటుంది: ‘నా జీవితమంతా కాయకష్టం చేశాను. నేను పనిచేసిన రోజుల్ని బట్టి ఆ గుంట అడుగుకి ఎంత త్వరగా చేరుకోగలనో తేలిపోతోంది. ఆ గుంటనుంచి బయటపడగలను, కాని అది నా బలం తో కాదు. మరింక నేను కష్టపడలేను. నా శరీరం చెయ్యగలిగిన దానికన్నా ఏ కొంచెం ఎక్కువ శారీరక శ్రమ చేసినా నన్ను దేవుడు చంపినా చంపొచ్చు ‘.
ఇక అప్పటినుంచీ శ్రమించడం నుంచి తప్పుకు తిరిగేవాడిని. అలా అలా యునైటెడ్ స్టేట్స్, కెనడాల మీదుగా వేలాది మైళ్ల దూరం ప్రయాణిస్తూ పోగా పోగా నయాగరా తీరానికి చేరాను. అక్కడో పోలీసు నన్ను పట్టుకున్నాడు. నేనేం చేసింది చెప్పకుండా, నేను చెప్పింది వినకుండా నన్ను అరెస్ట్ చేశాడు. నాకు చిరునామా, ఉపాధి వివరాలు లేవని 30 రోజుల జైలు శిక్ష విధించాడు. చేతికి సంకెళ్ళు వేసి, ఇనుప గొలుసులు తగిలించిన నాలాంటి మరికొంత మందితో కలిపి ఈరీ కౌంటీ సంస్కరణ శాల (అమెరికాలో సంస్కరణశాలని మనమైతే జైలని పిలుస్తాము)కు తరలించారు. తల నుంచి గొలుసులు వేసి, మీసం గీసం అన్నీ గీసేసి, ఖైదీ దుస్తులు వేసేసి వదిలారు జైలులో. మెడిసిన్ చదువుకుంటున్న పిల్లలతో ప్రాక్టీస్ కోసమని మాకు వాక్సీన్ ఇప్పించారు. వించెష్టర్ తుపాకులు పట్టుకున్న సైనికుల పహారాలో మాచేత పని చేయించడం మొదలుపెట్టారు. అంతా బ్లాండ్ బీస్ట్ తరహాలో ఉంది.
సరే మళ్లీ నా భావ మార్పిడి దగ్గరకు వద్దాం. ఇప్పటివరకు చెప్పినదాన్ని బట్టి నాలోవున్న విచ్చలవిడి వ్యక్తివాదం క్రమక్రమంగా అదృశ్యమవుతుండగా, మరేదో ఇంకోటి నాలోకి క్రమక్రమంగా చొచ్చుకురావడం గమనించారు కదా. అంతకు మునుపు అదేమిటో తెలియకుండానే వ్యక్తివాదిని అయినట్లుగా ఇప్పుడు కూడా ఇదేమిటో తెలియకుండానే నేనో సోషలిస్టును. అశాస్త్రీయమైన సోషలిస్టును. నాకు పునర్జన్మ లభించింది. కానీ కొత్త పేరు పెట్టుకోకుండా పాత పేరుతోనే నా గురించి నేను తెలుసుకోవడానికి నానాపాట్లు పడుతున్నాను. వెనక్కి కాలిఫోర్నియా పరిగెత్తి ఇంక చదవడం మొదలుపెట్టాను. మొదట్లో ఏమేం చదివానో అంతగా గుర్తులేదు గాని అదేమంత ముఖ్యమైన విషయం కాదనుకోండి. అదేమిటో తెలియకపోయినా నేనప్పటికే సోషలిస్టును, అయితే ఈ పుస్తకాలన్నీ చదవడం వల్ల నేనో సోషలిస్టునని తెలుసుకోగలిగాను. ఇంక అక్కడినుంచి ఎన్నో పుస్తకాలు చదివాను గాని, చదివిన వాటిలో ఏ ఒక్క ఆర్థిక సిద్ధాంతంగాని, మరే ఇతర గొప్ప భావనగాని, సోషలిజపు విశేషం గాని – ఆరోజు ఆ సామాజిక గుంటలో జారిపోతూ, జారిపోతూ అట్టడుగున అగుపించని అధోజగత్తు సహోదరుల విదారక దృశ్యం కలిగించినంత ప్రభావం కలగజేయ లేదంటే నమ్మండి.
0 స్పందనలు నుండి “జాక్ లండన్ : నేనెలా సోషలిస్టును అయ్యానంటే…” కు